Sunday, October 9, 2022

మన బాధ్యత

మనం, మన రాష్ట్రం, మన దేశం శుభిక్షంగా ఉండాలంటే? ఇవి పాటిస్తున్నమా చూసుకోండి.


  1. ప్రతీ ఒక్కరి ఇంటి ముందు చెట్లు ఉండేటట్లు చూసుకోండి. ఇంటి ముందు శుభ్రంగా ఉండాలనో, వాహనం నిలుపడానికో మొత్తం సిమెంట్ ఫ్లోరింగ్ చేయించవద్దు. ఒకటి లేదా రెండు పెద్ద చెట్లు పెట్టడానికి ప్రయత్నించండి. 
  2. ఇంట్లో ఇండోర్ మొక్కలు పెట్టడానికి, మిద్దతోటలను పెంచటానికి ప్రయత్నించండి. 
  3. ప్రతీ ఒక్కరి ఇంట్లో ఇంకుడు గుంతను తప్పనిసరిగా నిర్మించేటట్టు/ఉండేటట్లు చూసుకోండి. వర్షపు నీటిని ఒడిసి పట్టుకోండి. 
  4. ఇంటి ముందు వాకిలి ఊడ్చేటప్పుడు ఇంటి ముందు ఉన్న చెత్తను పక్క ఇంటి వాళ్ళ వైపు ఊడ్చి నెట్టవద్దు. ఆ చెత్తను మీరే ఎత్తివేయండి, అది మీ బాధ్యతగా భావించండి. మన వీధి మనమే శుభ్రంగా ఉంచుకోవాలి. అదేదో ప్రభుత్వానిది మాత్రమే బాధ్యత అని అనుకోకూడదు. 
  5. చెత్తను చెత్త బుట్టలోనే పడవేయాలి. ఎక్కడ పడితే అక్కడ, అంటే వీధిలోనో, ఇంటి పక్కన లేదా బయట ఉన్న ఖాళీ ప్రదేశాలలోనో పడవేయవద్దు. 
  6. చెత్తను చెత్త బుట్టలో వేసేటప్పుడు అందులో (తడి, పొడి చెత్త వేరుగా) ప్లాస్టిక్, ఇనుప, సీసా మొదలగు వ్యర్ధాలను అంటే ప్లాస్టిక్ డబ్బాలు, శాంపో బాటిల్స్ ఇలా మొదలగున్నవి చెత్త డబ్బాలో పడవేయకుండా మీరే వాటిని శ్రమ అనుకోకుండా వేరు చేసి సంచులలో భద్రపరిచి రీసైక్లింగ్ (ప్లాస్టిక్/ఇనుప సామాన్లు కొనేవారికి) అమ్మేయండి. లేదా చెత్త తీసుకొని వెళ్ళేవాళ్లకు అయినా ఇవ్వండి. ఎందుకంటే అందరూ వేసే చెత్తలో అలాంటి వాటిని మొత్తం వేరు చేయటం వాళ్లకు కూడా సాధ్యం కాదు. 
  7. బయటకు లేదా విహార యాత్రలకు వెళ్ళినపుడు ఎక్కడ పడితే అక్కడ చెత్తను (ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్ధాలను) పడవేయకండి. ప్లాస్టిక్ కవర్లను బయటపడవేసినప్పుడు అవి భూమిలో కరగక భూమి పై పొరలల్లో నే ఉండిపోయి వర్షపు నీరు భూమిలో ఇంకకుండా చేస్తున్నాయి. 
  8. ఇంటి వాకిలి ఊడ్చిన తర్వాత పైపులతో వాకిలి కడగవద్దు. బకెట్, జగ్గు వాడి కొద్ది నీటిని మాత్రమే వాడాలి, రోడ్డు మొత్తం కడగవద్దు, ఆ రోడ్డు పై ఆ నీరు ఎటు వెళ్లలేక వీధి రోడ్లు మొత్తం కరాబు అవుతున్నాయి. 
  9. వాహనాలు, ఇండ్లు కడిగేటప్పుడు వాటర్ పైపులతో కడగకండి, నీటిని వృధా చేయకండి, పొదుపుగా బకెట్, జగ్గులతో నీటిని వాడుకోండి. 
  10. విహార యాత్రలకు వెళ్ళినపుడు అక్కడ పుణ్యక్షేత్రాలలో ఉండే నదులల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలను పడవేయవద్దు. అందులో వేసే ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ నీటి కాలుష్యంగా మారిపోతున్నాయి. వాటి వల్ల ఎన్నో జీవరాసులు కూడా చనిపోతున్నాయి. కాలువలు, చెరువులు, నదులు మన దేశ వనరులు, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. 
  11. బయటకు ఎక్కడికి వెళ్లినా ఇంటి నుండి నీళ్ల బాటిల్ ని తీసుకొని వెళ్ళండి. బయట అమ్మే ప్లాస్టిక్ బాటిల్ వినియోగాన్ని తగ్గించవచ్చు. అటు ఆరోగ్యాన్ని ఇటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. 
  12. వంటింట్లో ఉండే సింక్ లల్లో అంట్లను పడకుండా జాలిని వాడుకొని డ్రైనేజి జామ్ కాకుండా చూసుకోండి. 
  13. డ్రైనేజి లల్లో చెత్తను, వాడిపడేసే డైపెర్ లను, ప్లాస్టిక్ కవర్లను, కండోమ్ లను పడవయేవద్దు. వీటి వల్ల వీధిలో డ్రైనేజీ నీళ్లు పొంగిపొర్లుతున్నాయి. 
  14. సామాన్లు, కూరగాయలు, పండ్లు మొదలగు వాటిని కొనటానికి బయటకు వెళ్ళినపుడు ఇంటినుండే సరిపడు చేతి బట్ట లేదా జనపనార సంచులను వాడేటట్టు చూసుకోండి. బయట వ్యాపారుల దగ్గర ప్లాస్టిక్ సంచులను అడగవద్దు. కొందరైతే చిరు వ్యాపారుల దగ్గర ప్లాస్టిక్ సంచులు ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర కొనటమే మానేస్తున్నారు. అలా వాళ్ల వ్యాపారాన్ని దెబ్బతీయకండి. మీరే బ్యాగులను తీసుకవెళ్లండి. 
  15. బైక్ లేదా కారులో వెళ్ళేవాళ్ళు ఎల్లప్పుడూ చేతి సంచులను స్పేర్ లో ఉంచుకోండి. అవసరం వచ్చినపుడు బయట ప్లాస్టిక్ సంచులను అడగకుండా ఉండవచ్చు. 
  16. వీలైనంత వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి, కుదిరితే మానేయండి. మానేయడం కుదరదు అని అనుకోకండి, ప్రయత్నిస్తే సాధ్యం అవ్వదు అని ఏది లేదు. మీ వంతుగా మీరు మానేయండి. 
  17. పాన్, గుట్కా లు తిని ఎక్కడపడితే అక్కడ అంటే రోడ్లమీద, మేడ మెట్ల మీద ఉమ్మివేయకండి. కుదిరితే పాన్, గుట్కాలు తినటం మానేయండి. 
  18. పాలు పాల ప్యాకెట్లను వాడేవాళ్ళు, పాల ప్యాకెట్ కవర్ల చివరను పూర్తిగా కట్ చేయకండి. అలా కట్ చేసి పడవేసిన ప్లాస్టిక్ ముక్క చెత్తలో కనపడదు. ఆ ముక్క కనపడక పశువులు చెత్తను తింటే ఆ ప్లాస్టిక్ కవర్ వాటి కడుపులోకి వెళ్లి అవి ఇబ్బంది పడతాయి. కుదిరితే పాల ప్యాకెట్లు మానేసి డైరెక్ట్ గా పాలను కొనండి లేదా వాళ్లనే అలా పోయమనండి, అలా ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. 
  19. అవసరమైతేనే వెహికల్ బయటకు తీయండి, ఇంధనాన్ని పొదుపు చేయండి. 
  20. సామాన్లు కొనేటప్పుడు ఏమికొనాలో నిర్ణహించుకొని మాత్రమే కొనండి, అనవసరమౌనవి కొనకండి. డబ్బు వృధా కాకుండా చూసుకోండి 
  21. కరెంట్, నీటి మరియు ఇంటి పన్ను సకాలంలో ఉండేటట్టు చూసుకోండి. 
  22. ఎవరు ఏమి చెప్పినా అది ఎందుకు చెప్పారు అని ఆలోచించండి, గుడ్డిగా ఏది నమ్మకండి. 
  23. ఏమన్నా తప్పు కానీ ప్రమాదం కానీ జరుగుతే నాకెందుకులే అని వదిలేయకండి, మీ వంతుగా చేయగలిగింది చేయండి, అది మన ధర్మం అని గుర్తించుకోండి. 
  24. సమాజ సేవలో ప్రతీ ఒక్కరూ భాగంకండి. దేశం మనకేమిచ్చింది అని కాకుండా మనం దేశం గురించి ఏం చేస్తున్నాం అని ఆలోచించండి. 
  25. ఏదైనా తప్పు జరుగుతే ప్రశ్నించటం నేర్చుకోండి. 
  26. ప్రతీ ఒక్కరూ కలిసి మెలసి ఉండేటట్టు చూసుకోండి.

Wednesday, May 18, 2022

ఎండలు మండుతున్నాయి

ఎండలు మండుతున్నాయి



ప్రతీ ఒక్కరికీ విజ్ఞప్తి,

ఎండలు మండుతున్నాయి, భూమి రోజు రోజుకు వేడి షెఘలు కక్కుతుంది. భూమి జలాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. ప్రతీ ఒక్కరూ కూలెర్స్, ఏసీ లని పరుగెడుతున్నారు. కారణం అందరికీ తెలిసిందే కాంక్రీట్ జంగల్ గా మారటం. చెట్లు నాటకపోవటం, ఉన్న చెట్లను నరికి వేయటం, కాలుష్యం పెరగటం, ఉన్న నీరు రోడ్ల పాలు చేయటం, ఆ నీరు వివిధ కారణాల వల్ల భూమిలోకి ఇంకక పోవటం. మరి వీటిని ఎలా అరికట్టాలి, దానికి ఒక చిన్న ఉపాయం *ఇంకుడు గుంత*, ఇంకా చాలా ఉన్నాయి, అంటే చెట్లు నాటడం, నీటి జలాలను కాపాడుకోవడం. కానీ అన్నీ ఒకేసారి చేయకున్నా, కనీసం ప్రతీ ఇంటికి ఒక ఇంకుడు గుంత ఉండేటట్టు చేసుకోవటం.


Image from indiamart

ప్రత్యేకంగా కాలనీ వాసులకు, మరియు క్రొత్తగా ఇండ్లు కట్టుకునేవారు, ఇండ్లు కట్టించే బిల్డర్లకు విజ్ఞప్తి, నీటిని రోడ్డు మీదకు వదలకుండా, ఇంట్లోనే బోర్ కు దగ్గరలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకుంటే భూమి జలాలను కాపాడుకున్నవాళ్ళము అవుతాము. భవిష్యత్తులో బోర్ లు ఎండి పోకుండా, భూమి వేడి ఎక్కకుండా చూసుకోగలము. ఇంకుడు గుంతవల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వర్షం వచ్చినపుడు కూడా, నీటిని ఒడిసిపట్టుకొని ఎన్నో గ్యాలన్ల నీటిని భద్రపరుచుకోగలుగుతాము. కాలనీ పెద్దలు, అసోసియేషన్ సభ్యులు వాళ్ళ మీటింగు లల్లో కూడా చర్చించుకొని కాలనీలో అందరి చేత ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేటట్లు చేయగలరని విజ్ఞప్తి. వర్షాకాలం వచ్చే లోపే అందరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోగలరు. 🙏

నవీన్ కుమార్ వల్లోజు
Save Nature, Save Water

Saturday, March 26, 2022

ప్లాస్టిక్ మానేయడం సాధ్యమేనా...

 ప్లాస్టిక్ మానేయడం సాధ్యమేనా...

ఎందుకు సాధ్యం కాదు, మనిషి తలుచుకోవాలే తప్ప, ఏదీ అసాధ్యం కాదు. కొద్దిగా అలవాటు చేసుకోవటానికి కష్టం అవుతుందేమో తప్ప, లేక కొద్దిగా మారటానికి లేదా మార్చుకోవటానికి సమయం పడుతుంది అంతే, కాదు అనుకుంటే ఏది అవ్వదు.



చూద్దాం ఏమేమి మార్చుకోవాలో, చాలా మందికి ఏదో ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఏ ప్రమాదం అనుకుంటున్నారు. కానీ వాడే ప్రతీ ప్లాస్టిక్ ప్రమాదమే, మా అంటే ఎక్కువ తక్కువ అంతే. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ మరీ ప్రమాదం అందుకే మానెయ్యండి అని అంటున్నారు. కానీ ప్రతీ ప్లాస్టిక్ ఎలా ప్రమాదమో చూద్దాము, దానికి ప్రత్యామ్నాయం ఏమన్నా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము.


1. ప్రొద్దున లేవగానే ప్లాస్టిక్ బ్రష్ లతోనే పళ్ళు తోముకోవటం. ఎంతో కొంత ప్లాస్టిక్ నోటి ద్వారా లోపలికి పోతుంది. దానికి ప్రత్యామ్నాయం చెక్క బ్రష్ లు, బ్యాంబూ బ్రష్ లు, వేప పుల్లలు, కానుగ పుల్లలు మొదలగున్నవి ఉన్నాయి.


2. ప్లాస్టిక్ కవర్లలో పాలు, అంటే పాల ప్యాకెట్లు తో రోజు మొదలవుతుంది. ఏ పదార్థమైనా ప్లాస్టిక్ కవర్ల లో ఉన్నాయంటే, ఆ పదార్థం లోకి ప్లాస్టిక్ ఎంతో కొంత చేరుతుంది. బయట టీ త్రాగినా ప్లాస్టిక్ గ్లాస్ లేదా ప్లాస్టిక్ పేపర్ గ్లాస్సెస్. వాటికి బదులు పాలు డైరెక్ట్ గా తెమ్మని చెప్పండి, పాల ప్యాకెట్లే దిక్కు అని అనుకోకండి. టీ త్రాగితే స్టీల్ లేదా గాజు గ్లాస్సెస్ వాడటం ఉత్తమం.


3. ఇక వంటింటి విషయానికొస్తే, ప్రతీ పోపు డబ్బా, పప్పు దినుసుల డబ్బాలు అన్నీ ప్లాస్టిక్ మయం, ప్రతీ తినే పదార్థం ప్లాస్టిక్ లోనే. ఇక వాటిని వాడితే అవి నోట్లోకి కాకపోతే ఎక్కడికి పోతాయి. కాబట్టి ఆ వాడే డబ్బాలు ఎంత మంచివైనా, నాణ్యతతో ఉన్నా తీసేయండి. వాటికి బదులు స్టీల్ డబ్బాలు, సీసాలు వాడుకోండి.


4. కూరగాయల విషయానికి వస్తే, మార్కెట్ కి వెళ్తే చాలు, అన్నీ ప్లాస్టిక్ కవర్లే, ప్రతీ కూరగాయలు వేరే వేరే ప్లాస్టిక్ కవర్ల లో0నే, మళ్ళీ అవన్నీ తీసుకొని పోయి ప్రిడ్జి లో పెట్టడమే, ఏ ప్లాస్టిక్ కవర్ల లో పెట్టినా అది కొద్ధి సేపటికి విషతుల్యమే. వాటిని వండుకొని తింటే ప్లాస్టిక్ కడుపులోకి కాకపోతే ఎక్కడికి పోతుంది. వాటికి బదులు బట్ట సంచులు, జ్యూట్ బ్యాగులు వాడుకోవాలి. ప్రిడ్జి లో కూరగాయలు పెట్టుకోవడానికి కూడా చిన్న చిన్న బట్ట సంచులు దొరుకుతున్నాయి.


5. ఇక ఇంట్లో లేదా బయటకి ఎక్కడికి వెళ్లినా ప్లాస్టిక్ బాటిల్స్ ఏ నాయే. నీళ్లు నిలువ ఉంచుకోవటానికి ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ బిందలు, ప్లాస్టిక్ గిన్నెలు... మరి మన శరీరంలోకి ప్లాస్టిక్ కాకపోతే మినరల్స్ వెళ్తాయా. వాటికి బదులు స్టీల్, రాగి, సీసా, మట్టి బాటిల్స్ వాడుకోవచ్చు. స్టీల్, రాగి, ఇత్తడి బిందెలు వాడుకోవచ్చు. బయటకు వెళ్ళినపుడు వాటర్ బాటిల్ ఇంటి నుండే తీసుకొని వెళ్ళండి, అప్పుడు బయట వాటర్ బాటిల్ కొనక్కరలేదు.


6. ఇక బుట్టల విషయానికొస్తే, అన్నీ ప్లాస్టిక్ బుట్టలు, పాత్రలు. పండ్లు పెట్టుకోవటానికి, కూరగాయలు కడగటానికి, తరగటానికి, ఇంకా ఇంకా అన్నిటికి ప్లాస్టిక్ ఏ నాయే, మరి రక్తంలో ప్లాస్టిక్ పేరుకపోగా ఇంకేం పేరుకుంటుంది. వాటికి బదులు వెదురు బుట్టలు, చెక్క పాత్రలు, స్టీల్, మట్టి పాత్రలు వాడుకోవాలి.


7. బయట కొనే ప్రతీ ఆహార పదార్థాలు, పప్పులు, ఉప్పులు ప్లాస్టిక్ కవర్ల లోనే నాయే. మరి మన లోపటికి ప్లాస్టిక్ వెళ్లక ఏం చేస్తుంది. ఇందులో కొన్ని పదార్థాలైనా డైరెక్ట్ గా కొనటానికి వీలుంటే ప్రయత్నించండి.


8. ఇక నాన్ వెజ్ విషయానికి వస్తే రెండ్రెండు లేదా మూడు కవర్లు. వాటికి బదులు స్టీల్ డబ్బాలు పట్టుకొనిపోండి.


9. ఇంట్లో పచ్చళ్ళు చేసుకుంటే నిలువ ఉంచటం కూడా ప్లాస్టిక్ డబ్బాలలోనే ఉంచుతున్నారు. వాటికి బదులు సీసా, పింగానీ సీసా లను వాడుకోవచ్చు.


10. బయట కొనే ప్రతీ తినే పదార్థం కావచ్చు, ఏదైనా హోటల్ నుంచి పార్సిల్ తెచ్చుకున్నా కూడా ప్లాస్టిక్ కవర్లు, డబ్బాలే. ఇంకా వేడి వేడిగా ఉంటే ఆ ప్లాస్టిక్ లో ఉన్న విష పదార్థాలను ఆహార పదార్థాలు గ్రహిస్తాయి. అవి తిన్నపుడు మన కడుపులోకి వెళ్లి హాని చేస్తాయి. వాటికి బదులు స్టీల్ బాక్స్ లో తెచ్చుకోవటం. లేదా బయట ఆహార పదార్థాలను తినటం మానేయటం. ఇంట్లోనే తయారు తయారు చేసుకోవటం ఉత్తమం.


11. ఏదైనా శుభకార్యం లేదా ఫంక్షన్ జరుగుతే ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ చెంచాలు, ప్లాస్టిక్ గ్లాసులు. మరి ప్లాస్టిక్ అణువులు మన కడుపులోకి పోకుండా ఎలా ఉంటాయి. వాటికి బదులు స్టీల్ ప్లేట్స్, లేదా సహజ సిద్ధమైన అరటి, మోదుగ, అడ్డాకు, అరిక ప్లేట్స్ లాంటివి వాడుకోవచ్చు.


12. చివరకు కూర్చునే కుర్చీ కూడా ఫైబరే, ఆ కుర్చీ ల వల్ల వచ్చే వేడి వల్ల కూడా మన శరీరానికి హానికరమే. వాటికి బదులు చెక్క, ఐరన్ కుర్చీలు వాడుకోవచ్చు.


ఇన్ని ప్రత్యామ్నాయాలు ఉండంగా కుదరదు అనుకుంటే ఎలా. ఏదో ఖర్చుకు ఎనకడుగు వేస్తే ఎలా. మంచి ఎప్పుడు ఖరీదుగానే ఉంటుంది. అందంగా ఉన్నాయనో, తక్కువ ఖర్చులో వస్తున్నాయనో, వాటి నిర్వహణ కష్టం అనుకుంటే ఎలా. వాటి జీవిత కాలం కూడా ఎక్కువే. ఒక్కసారి కొనుక్కుంటే జీవితాంతం వచ్చే అవకాశం కూడా ఉంది, కాబట్టి మంచిని అలవాటు చేసుకుందాం. ఆ అవి ఏం వాడుతాం మా వల్ల ఎక్కడ అవుతుంది అనుకుంటే మార్పు ఎప్పుడు సాధ్యం కాదు. ఇంకా కొందరు ప్లాస్టిక్ వచ్చిందే చెక్క, ఐరన్ కు ప్రత్యామ్నాయం, వాటిని చెడు అనుకుంటే ఎలా అని అంటుంటారు. కానీ చెడు ఎప్పుడు చెడే, కాబట్టి వాటి వాడకం తగ్గించుకుంటే మంచిది, మానేస్తే ఇంకా ఉత్తమం. చెక్క ఎక్కువగా పెరగాలంటే, అందరూ చెట్లు పెంచడం అలవాటు చేసుకోవాలి.


ఏదైనా మార్పు రావాలంటే అది ముందుగా మనతోనే ప్రారంభమవ్వాలి. ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే కొన్ని రోజులల్లోనే సాధ్యం అవుతుంది. కృషితో నాస్తి దుర్భిక్షం.