ప్లాస్టిక్ మానేయడం సాధ్యమేనా...
ఎందుకు సాధ్యం కాదు, మనిషి తలుచుకోవాలే తప్ప, ఏదీ అసాధ్యం కాదు. కొద్దిగా అలవాటు చేసుకోవటానికి కష్టం అవుతుందేమో తప్ప, లేక కొద్దిగా మారటానికి లేదా మార్చుకోవటానికి సమయం పడుతుంది అంతే, కాదు అనుకుంటే ఏది అవ్వదు.
చూద్దాం ఏమేమి మార్చుకోవాలో, చాలా మందికి ఏదో ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఏ ప్రమాదం అనుకుంటున్నారు. కానీ వాడే ప్రతీ ప్లాస్టిక్ ప్రమాదమే, మా అంటే ఎక్కువ తక్కువ అంతే. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ మరీ ప్రమాదం అందుకే మానెయ్యండి అని అంటున్నారు. కానీ ప్రతీ ప్లాస్టిక్ ఎలా ప్రమాదమో చూద్దాము, దానికి ప్రత్యామ్నాయం ఏమన్నా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము.
1. ప్రొద్దున లేవగానే ప్లాస్టిక్ బ్రష్ లతోనే పళ్ళు తోముకోవటం. ఎంతో కొంత ప్లాస్టిక్ నోటి ద్వారా లోపలికి పోతుంది. దానికి ప్రత్యామ్నాయం చెక్క బ్రష్ లు, బ్యాంబూ బ్రష్ లు, వేప పుల్లలు, కానుగ పుల్లలు మొదలగున్నవి ఉన్నాయి.
2. ప్లాస్టిక్ కవర్లలో పాలు, అంటే పాల ప్యాకెట్లు తో రోజు మొదలవుతుంది. ఏ పదార్థమైనా ప్లాస్టిక్ కవర్ల లో ఉన్నాయంటే, ఆ పదార్థం లోకి ప్లాస్టిక్ ఎంతో కొంత చేరుతుంది. బయట టీ త్రాగినా ప్లాస్టిక్ గ్లాస్ లేదా ప్లాస్టిక్ పేపర్ గ్లాస్సెస్. వాటికి బదులు పాలు డైరెక్ట్ గా తెమ్మని చెప్పండి, పాల ప్యాకెట్లే దిక్కు అని అనుకోకండి. టీ త్రాగితే స్టీల్ లేదా గాజు గ్లాస్సెస్ వాడటం ఉత్తమం.
3. ఇక వంటింటి విషయానికొస్తే, ప్రతీ పోపు డబ్బా, పప్పు దినుసుల డబ్బాలు అన్నీ ప్లాస్టిక్ మయం, ప్రతీ తినే పదార్థం ప్లాస్టిక్ లోనే. ఇక వాటిని వాడితే అవి నోట్లోకి కాకపోతే ఎక్కడికి పోతాయి. కాబట్టి ఆ వాడే డబ్బాలు ఎంత మంచివైనా, నాణ్యతతో ఉన్నా తీసేయండి. వాటికి బదులు స్టీల్ డబ్బాలు, సీసాలు వాడుకోండి.
4. కూరగాయల విషయానికి వస్తే, మార్కెట్ కి వెళ్తే చాలు, అన్నీ ప్లాస్టిక్ కవర్లే, ప్రతీ కూరగాయలు వేరే వేరే ప్లాస్టిక్ కవర్ల లో0నే, మళ్ళీ అవన్నీ తీసుకొని పోయి ప్రిడ్జి లో పెట్టడమే, ఏ ప్లాస్టిక్ కవర్ల లో పెట్టినా అది కొద్ధి సేపటికి విషతుల్యమే. వాటిని వండుకొని తింటే ప్లాస్టిక్ కడుపులోకి కాకపోతే ఎక్కడికి పోతుంది. వాటికి బదులు బట్ట సంచులు, జ్యూట్ బ్యాగులు వాడుకోవాలి. ప్రిడ్జి లో కూరగాయలు పెట్టుకోవడానికి కూడా చిన్న చిన్న బట్ట సంచులు దొరుకుతున్నాయి.
5. ఇక ఇంట్లో లేదా బయటకి ఎక్కడికి వెళ్లినా ప్లాస్టిక్ బాటిల్స్ ఏ నాయే. నీళ్లు నిలువ ఉంచుకోవటానికి ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ బిందలు, ప్లాస్టిక్ గిన్నెలు... మరి మన శరీరంలోకి ప్లాస్టిక్ కాకపోతే మినరల్స్ వెళ్తాయా. వాటికి బదులు స్టీల్, రాగి, సీసా, మట్టి బాటిల్స్ వాడుకోవచ్చు. స్టీల్, రాగి, ఇత్తడి బిందెలు వాడుకోవచ్చు. బయటకు వెళ్ళినపుడు వాటర్ బాటిల్ ఇంటి నుండే తీసుకొని వెళ్ళండి, అప్పుడు బయట వాటర్ బాటిల్ కొనక్కరలేదు.
6. ఇక బుట్టల విషయానికొస్తే, అన్నీ ప్లాస్టిక్ బుట్టలు, పాత్రలు. పండ్లు పెట్టుకోవటానికి, కూరగాయలు కడగటానికి, తరగటానికి, ఇంకా ఇంకా అన్నిటికి ప్లాస్టిక్ ఏ నాయే, మరి రక్తంలో ప్లాస్టిక్ పేరుకపోగా ఇంకేం పేరుకుంటుంది. వాటికి బదులు వెదురు బుట్టలు, చెక్క పాత్రలు, స్టీల్, మట్టి పాత్రలు వాడుకోవాలి.
7. బయట కొనే ప్రతీ ఆహార పదార్థాలు, పప్పులు, ఉప్పులు ప్లాస్టిక్ కవర్ల లోనే నాయే. మరి మన లోపటికి ప్లాస్టిక్ వెళ్లక ఏం చేస్తుంది. ఇందులో కొన్ని పదార్థాలైనా డైరెక్ట్ గా కొనటానికి వీలుంటే ప్రయత్నించండి.
8. ఇక నాన్ వెజ్ విషయానికి వస్తే రెండ్రెండు లేదా మూడు కవర్లు. వాటికి బదులు స్టీల్ డబ్బాలు పట్టుకొనిపోండి.
9. ఇంట్లో పచ్చళ్ళు చేసుకుంటే నిలువ ఉంచటం కూడా ప్లాస్టిక్ డబ్బాలలోనే ఉంచుతున్నారు. వాటికి బదులు సీసా, పింగానీ సీసా లను వాడుకోవచ్చు.
10. బయట కొనే ప్రతీ తినే పదార్థం కావచ్చు, ఏదైనా హోటల్ నుంచి పార్సిల్ తెచ్చుకున్నా కూడా ప్లాస్టిక్ కవర్లు, డబ్బాలే. ఇంకా వేడి వేడిగా ఉంటే ఆ ప్లాస్టిక్ లో ఉన్న విష పదార్థాలను ఆహార పదార్థాలు గ్రహిస్తాయి. అవి తిన్నపుడు మన కడుపులోకి వెళ్లి హాని చేస్తాయి. వాటికి బదులు స్టీల్ బాక్స్ లో తెచ్చుకోవటం. లేదా బయట ఆహార పదార్థాలను తినటం మానేయటం. ఇంట్లోనే తయారు తయారు చేసుకోవటం ఉత్తమం.
11. ఏదైనా శుభకార్యం లేదా ఫంక్షన్ జరుగుతే ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ చెంచాలు, ప్లాస్టిక్ గ్లాసులు. మరి ప్లాస్టిక్ అణువులు మన కడుపులోకి పోకుండా ఎలా ఉంటాయి. వాటికి బదులు స్టీల్ ప్లేట్స్, లేదా సహజ సిద్ధమైన అరటి, మోదుగ, అడ్డాకు, అరిక ప్లేట్స్ లాంటివి వాడుకోవచ్చు.
12. చివరకు కూర్చునే కుర్చీ కూడా ఫైబరే, ఆ కుర్చీ ల వల్ల వచ్చే వేడి వల్ల కూడా మన శరీరానికి హానికరమే. వాటికి బదులు చెక్క, ఐరన్ కుర్చీలు వాడుకోవచ్చు.
ఇన్ని ప్రత్యామ్నాయాలు ఉండంగా కుదరదు అనుకుంటే ఎలా. ఏదో ఖర్చుకు ఎనకడుగు వేస్తే ఎలా. మంచి ఎప్పుడు ఖరీదుగానే ఉంటుంది. అందంగా ఉన్నాయనో, తక్కువ ఖర్చులో వస్తున్నాయనో, వాటి నిర్వహణ కష్టం అనుకుంటే ఎలా. వాటి జీవిత కాలం కూడా ఎక్కువే. ఒక్కసారి కొనుక్కుంటే జీవితాంతం వచ్చే అవకాశం కూడా ఉంది, కాబట్టి మంచిని అలవాటు చేసుకుందాం. ఆ అవి ఏం వాడుతాం మా వల్ల ఎక్కడ అవుతుంది అనుకుంటే మార్పు ఎప్పుడు సాధ్యం కాదు. ఇంకా కొందరు ప్లాస్టిక్ వచ్చిందే చెక్క, ఐరన్ కు ప్రత్యామ్నాయం, వాటిని చెడు అనుకుంటే ఎలా అని అంటుంటారు. కానీ చెడు ఎప్పుడు చెడే, కాబట్టి వాటి వాడకం తగ్గించుకుంటే మంచిది, మానేస్తే ఇంకా ఉత్తమం. చెక్క ఎక్కువగా పెరగాలంటే, అందరూ చెట్లు పెంచడం అలవాటు చేసుకోవాలి.
ఏదైనా మార్పు రావాలంటే అది ముందుగా మనతోనే ప్రారంభమవ్వాలి. ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే కొన్ని రోజులల్లోనే సాధ్యం అవుతుంది. కృషితో నాస్తి దుర్భిక్షం.
No comments:
Post a Comment