Saturday, September 27, 2025

వరదలు మంపులు - ఇంకెన్నాళ్ళు, ఇప్పటికైనా మనం మేల్కొవాలి

 "వరదలు మంపులు"

ఇంకెన్నాళ్ళు, ఇప్పటికైనా మనం మేల్కొవాలి....

మనం చేసే పొరపాట్లు వళ్ళే ఈ వాతావరణ మార్పులు, ఉంటే అతి వృష్టి లేదా అనా వృష్టి. ఇదంతా మనకెందుకులే అనుకోవటం వల్లే, నేనొక్కడిని మారితే సరిపోతుందా అనుకోవడమే, ఎవరికి లేని బాధ నాకొక్కడికేనా అనుకోవడమే ఈ పొరపాటులన్నిటికి కారణం.

మరి బారీ వర్షాలు పడినప్పుడు మనమేం చేస్తాం, మనమేమన్నా చేయగలుగుతామా, అంత నీటిని ఆపగలుగుతామా, ఇదంతా ప్రకృతి విలాపమా! మన తప్పులు అసలు లేవా?

వరదలు, తట్టుకోలేని బారీ వర్షాలు, కుంభ వృష్టి లేదా ఇంకేదన్నా నదులు, చెరువులు కట్టలు తెగితేనో ఇంట్లోకి వర్షపు నీరు వచ్చి బాధపడాల్సి వెచ్చేది. ఒకప్పుడు కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసిన అంత సమస్య ఉండేది కాదు. కానీ ఇప్పుడు చిన్న వర్షం కురిసిన ఇంట్లో, వీధుల్లో నీరే...

కారణాలు చూద్దాం...

  1. బిల్డింగ్ కట్టడాలు పెరిగి పోయాయి, చెట్లు, అడవులు మాయమయ్యాయి, పూర్తిగా కాంక్రీట్ జంగిల్ గా మార్చేసుకుంటున్నాం. ఇల్లు కడితే చెట్లు ఉండవు, నీటిగా ఉండాలని ఇంటి ముందు నీళ్లు ఇంకకుండా సిమెంట్ తో పూర్తిగా కప్పివేస్తున్నాం. ఇంటి ముందు చెట్లు తీసివేసి చిన్న చిన్న మొక్కలు మాత్రమే పెడుతున్నాం. 

  2. నీళ్లు భూమి లోకి ఇంకక పోవడానికి ఇంకొక ముఖ్య కారణం ప్లాస్టిక్, ప్లాస్టిక్ సంచులను, కవర్లను బయట పడవేయడం వల్ల భూమిలో ఒక లేయర్ గా ఏర్పడి నీరు భూమి లోకి ఇంకడం లేదు. 

  3. కట్టడాలు పెరిగే కొద్ది కాలి ప్రదేశాలు మాయమవుతూ ఉంటాయి. మరి ఇల్లు, బిల్డింగ్ కట్టినపుడు మనం ఇంకుడు గుంతలు కడుతున్నామా! పూర్వం ఇండ్లు కట్టి అమ్మే బిల్డర్లు లేరు, ఇప్పుడు బిల్డర్లు తయారయ్యారు, లాభాలు చూసే వారే అయ్యారు కానీ ఒక ఇంకుడు గుంత కట్టించే బిల్డరే లేకుండా పోతుంది. బిల్డర్ల తప్పు కూడా ఇందులో ఉంది. మూడు, నాలుగు బాత్రూమ్ లు అయినా కట్టుకుంటాం కానీ ఇంకుడు గుంతకు మాత్రం ప్లేస్ లేదు అని సాకులు చెబుతాం. గవర్నమెంట్ రూల్స్ పెట్టినా కూడా మనం ఇండ్లలో ఇంకుడు గుంతలు కట్టుకోకుండా ఇండ్లమీద పడ్డ నీటిని పైపులు పెట్టిమరీ రోడ్ల మీదకు వదిలిపెడుతున్నాం. మరి మనకు బాధ్యత లేదా? 

  4. వీధుల్లో, రోడ్ల ప్రక్కన చెట్లు సరిగా లేకపోవడం ఒక కారణం. ముఖ్య మైన చెట్లు కనుమరుగవ్వడం. ఒకప్పుడు వేప చెట్లు చాలా ఉండేవి, ఇప్పుడు అవి కనుమరుగవుతున్నాయి. వేప, రావి, మర్రి, చింత చెట్టు ఇలా పెద్ద పెద్ద చెట్లు అక్కడక్కడ ఉండేవి. ఇప్పుడు అవి చూద్దాం అన్నా సరిగా కనపడటం లేదు. ఇక షాపుల ముందు చెట్లు పెంచడం లేదు, ఒకవేళ ఉంటే నా షాప్ బోర్డు కనపడట్లేదనో, లేదా షాపు కనపడట్లేదనో ఆ చెట్లను నరికివేస్తున్నారు. ఇంకొందరు కరెంట్ పోల్స్, వైర్లు, తీగలు ఉన్నాయి అని, అడ్డు ఉన్న కొమ్మలను నరకకుండా, పూర్తిగా చెట్లనే నరికివేస్తున్నారు. 

  5. అతి ముఖ్యమైనది, చెరువులు, కుంటలు మాయమవ్వడం. పూర్వం అవసరాల కోసం, ఇబ్బంది లేకుండా, ప్రమాదాలు వచ్చిన నీరు చెరువులు, కుంటల లోకి నీటిని మళ్లించేవారు. ఊర్లో చెరువులు లేకుంటే జనాలు అందరు కలిసి చెరువు తవ్వుకునేవారు. అప్పటి రాజులు, మరియు నిజాం కాలంలో కూడా చెరువులను తవ్వించారు. అప్పటి భాగ్యనగరం (హైద్రాబాద్) లో రెండు వేలకు పైన చెరువులు, కుంటలు ఉంటే ఇప్పుడు కట్టడాల పేరుతో రెండు వందలు చెరువులు కూడా లేకుండా చేశారు. ఇదంతా కొందరు అవినీతి రాజకీయ నాయకులు, డబ్బున్న బడాబాబులు, ప్రభుత్వ అధికారులు చేసిన పనే, పూర్తిగా ప్రభుత్వాల విఫలం. ప్రతీ సంవత్సరం చెరువుల పూడిక తీయక పోవడం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఒకప్పుడు ఒక చెరువు నిండితే కాలువలు, నాళాల ద్వారా ఇంకొక చెరువుకు గొలుసు కట్టు విధానంతో అనుసంధానం ఉండేది, ఇప్పుడు ఆ కాలువలు, నాళాలను కూడా కబ్జాలు చేసేసారు. అప్పుడు ముందు చూపుతో చెరువులను తవ్విస్తే, ఇప్పుడు స్వంత ప్రయోజనాల కొరకు కబ్జాలు చేసి చెరువులను, కుంటలను మాయం చేశారు. జనాలు కూడా ప్రశ్నించక పోవడం ఇందుకు కారణమే, కలిసి కట్టుగా పోరాడకుండా మాకెందుకులే అనుకోవడమే. 

  6. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం. డ్రైనేజీ ఉన్న ప్రదేశాలలో నాణ్యత లోపాల వల్ల సరిగా లేకపోవడం. ఇంకా కొన్ని చోట్ల ఎప్పుడో ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థే ఉండటం. వర్షపు నీరు వచ్చినపుడు ఆ డ్రైనేజీ వ్యవస్థే సరిపోకపోవడం. రోడ్లు వేసేటప్పుడు నీరు పోయే మార్గం చూపకపోవడం, అంటే రోడ్లు వేసేటప్పుడు ఇంకుడు గుంతల ఏర్పాటు లేకపోవడం, అది రవాణా వ్యవస్థ కు, నీటి పారుదల సంస్థకు సరైన సమన్వయం లేకపోవడం కూడా ముఖ్య కారణమే. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. కొందరు జనాలు డ్రైనేజీ లలో ప్లాస్టిక్ రాపర్లు, షాంపూ ప్యాకెట్లు, కండోమ్ ప్యాకెట్లు మొదలగున్నవి వేయడం కూడా నీరు సరిగా పోకపోవడానికి కారణం అవుతున్నాయి. 

మరి దీనికి పరిష్కారం ఏమిటి? దీనిలో మన బాధ్యత ఏంటి?

  1. ఇండ్ల కట్టడాలు, జనాభా పెరుగుతున్నపుడు దానికి సరిపడా చెట్లు ఉండేటట్లు చూసుకోవాలి. ప్రతీ ఇంటి ముందు పూర్తిగా సిమెంట్ తో కప్పి వేయకుండా, కొన్ని మొక్కలు మరియు కనీసం రెండు పెద్ద చెట్లు ఉండేటట్లు చూసుకోవాలి. పెద్ద చెట్లు అనగానే కొందరు వెంటనే పెద్ద చెట్లు ఇంటి ముందు ఎలా పెంచుతాము, మా గోడలు పగులుతాయి, వేర్లు లోపటికి వస్తాయి, కార్లు, వెహికల్స్ ఎక్కడ పెట్టుకోవాలి, రోడ్డు సరిపోవద్దా అనే వారు ఉంటారు. పెద్ద చెట్లు అంటే వేప, మర్రి, రావి, చింత ఇలా కాకుండా, కొద్ది మొత్తం లో పెరిగే మామిడి, ఉసిరి, కానుగ మొదలగున్న వాటిని పెంచుకోవచ్చు. ఇలా వెహికల్స్ అంటారా... వెహికల్స్ లేకుండా బ్రతకచ్చు కానీ చెట్లు లేకుండా ఎలా బ్రతుకుతావు, చెట్లే లేకపోతే గాలి (ప్రాణ వాయువు) ఎలా వస్తుంది, అది కూడా గమనించలేని స్థితిలో మనం ఉన్నాము. ఆ రెండు పెద్ద చెట్లే ఉంటే నీకు, నీ కార్లకు అంటే వెహికల్స్ కు కూడా నీడను ఇస్తుంది, వాతావరణ ప్రమాదాలనుండి కాపాడుతుంది. ఇంకా కొందరు ఉంటారు చెట్ల వల్ల ఆకులు రాలుతున్నాయి, మీ చెట్లు వల్ల చెత్త మా ఇంటి ముందు పడుతుంది అని. చెట్లు ఇంటి ముందు ఉంటే ఆకులు కాకుంటే బంగారం రాలుతుందా! రాలుతే ఊకుతే సరిపోతుంది, రోజు ఇంటి ముందు ఊకవా! దానికి అంత ఆర్భాటం ఎందుకు. ఇంకొందరు ఉంటారు చెట్లు ఉంటే పురుగు పూచి, పాములు వస్తాయి అని... వాళ్ళ ఇంటి ముందుకు కొమ్మలు వేస్తే విరిచి పడేస్తూ ఉంటారు, మన ఇంటి ముందుకే కొమ్మలను పడేస్తూ ఉంటారు. చెట్లు ఉంటే అన్నీ వస్తాయి, నీవు ఎలా బ్రతుకుతున్నావో అవి కూడా అలానే బ్రతుకుతూ ఉంటాయి, నీవు జాగ్రత్తగా ఉండాలి అంతే కానీ భయంతో చెట్లనే నరికి వేస్తే ఎలా? ఆ చెట్ల వల్ల గాలి వస్తుంది అని గాలి పీల్చకుండా ముక్కు మూసుకుంటావా, అలా అని గాలి లేకుండా బ్రతకగలవా? మనం మారాలి, మన ఆలోచన మారాలి. ప్రకృతి తో బ్రతకడం నేర్చుకోవాలి. అంతస్తుల మీద అంతస్తులు అంటే ఎన్ని ప్లోర్లు కట్టామా అనే కాకుండా దానికి సరిపడా చెట్లను కూడా పెంచుతున్నామా లేదా అని కూడా చూసుకోవాలి.

  2. వీలున్న చోట ప్లాస్టిక్ సంచులకు బదులుగా బట్ట సంచులను లేదా జ్యూట్ బ్యాగులను వాడటం. ప్లాస్టిక్ కవర్లను రోడ్లమీద, కాలీ ప్రదేశాలలో పడవేయకుండా చెత్త బండీ లో, చెత్త బుట్టలలో పడవేయడం, మున్సిపల్ వాళ్లకు ఇవ్వాలి. ఇంట్లో ఉన్న చెత్తనే కాదు మీ (మన) ఇంటి ముందు ఉన్న చెత్తను కూడా శుభ్రం చేసుకోవడం మన బాధ్యత నే. చాలామంది ఇంటి ముందు ఉన్న చెత్తను, ప్లాస్టిక్ కవర్లను తీసివేయడం లేదు. మన కాలనీ మనమే శుభ్రంగా ఉంచుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడల్లా చేతి సంచులను ఇంటి నుండే తీసుకొని వెళ్ళడం, వాటర్ బాటిల్ లను తీసుకుని వెళ్ళడం వల్ల, బయట ప్లాస్టిక్ ను నివారించవచ్చు. ఒకేసారి మొత్తం ప్లాస్టిక్ ను నివారించక లేక పోయినా ఒక్కొక్కటిగా ప్లాస్టిక్ నివారణకు, వాడకాన్ని తగ్గించుకుంటూ రావాలి. ప్లాస్టిక్ కవర్లను వాడేసిన ప్లాస్టిక్ బాటిల్ లో పెట్టీ రీసైకిల్ కు వేస్తే ప్లాస్టిక్ కవర్లు బయట భూమి మీద పడకుండా ఉంటుంది.

  3. ప్రతీ ఇంట్లో, అపార్టుమెంటులో, బిల్డింగ్ లలో ఇంకుడు గుంత తప్పనిసరిగా ఉండాలి. ఇంట్లో ఉండే నీరు బయటకు, రోడ్ల మీదకు వదలకుండా ఉండాలి. కుదిరితే ఇంటి ముందు లేదా ఎక్కడైతే నీరు నిలబడుతూ ఉంటుందో అక్కడ ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి. ప్రతీ కాలనీలో ఈ చర్చలు జరగాలి, ఐకమత్యం తో పనులు చేసుకోగలగాలి. ఇది మన బాధ్యత, మనందరి బాధ్యత.

  4. ప్రతీ వీధిలో, ప్రతీ రోడ్ల ప్రక్కన చెట్లు ఉండేటట్లు చూసుకోవాలి, కాలనీ రోడ్లలో కాలనీ వాసులు మరియు అసోసియేషన్ బాధ్యత వహించాలి. బయట ప్రదేశాలలో ప్రభుత్వం బాధ్యత వహించాలి. బయట ఇష్టం ఉన్నట్లు చెట్లు నరకకుండా ప్రజలు, ప్రభుత్వం కలిసి చూసుకోవాలి.

  5. చెరువులు, కుంటలను కాపాడుకోవాలి, నాళాలు కబ్జా కాకుండా చూసుకోవాలి. దీనికి ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేయాలి.

  6. డ్రైనేజీ వ్యవస్థ ను మెరుగుపరచాలి. నాణ్యత లోపం లేకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలి. జనాలు కూడా డ్రైనేజీ లలో చెత్త వేయకుండా చూసుకోవాలి.

పై వాటిలో ఏ బాధ్యత లేకున్నా వారికి ప్రశ్నించే హక్కు లేదు. మన ప్రదేశం సరిగా ఉండాలంటే మనం ముందుగా అన్నీ సక్రమంగా చేస్తున్నామా చూసుకోవాలి.


1 comment: